విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : నిహారిక-చైతన్యల ఎడబాటు పూర్తిగా వారి వ్యక్తిగతమే. అయినప్పటికీ ఇది ఒక రకంగా సామజికమయినది కూడా. దీనికి ప్రసార మాధ్యమాలను నిందించి చేతులు దులుపుకోవాల్సిన పనిలేదు. నిహారిక సెలెబ్రిటీ కుటుంభం నుంచీ రావడం వల్ల మాత్రమే ఇది బహిరంగ చర్చకు రాలేదు. అలాగే సమంత-చైతన్యల సమస్య కూడా అలాంటిదే. పెళ్లిళ్లు పెటాకులు కావడం సెలెబ్రిటీల కుటుంబాలకు మాత్రమే పరిమితం అయ్యాయా? లేదు కదా! కాకపోతే విడిపోయిన సెలెబ్రిటీల కుటుంబాలతో మధ్య తరగతి కుటుంభాలవాళ్ళు తమను తాము ఐడెంటిఫై చేసుకొని ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తు ను చూసి బెంబేలెత్తుతున్నారు. విచ్చిన్నమయిన గతాన్ని గుర్తు చేసుకుని దిగాలు పడుతున్నారు. "అరే! నిహారిక, చైతన్య చిలకా-గోరింకల్లాగున్నారే! అంగరంగ వైభవంగా ఎవరూ కనీ ఎరుగని రీతిలో విలాసవంతంగా పెళ్లి చేసుకున్నారే! అయినా ఏమైంది వీళ్ళకి" అని అన్ని వర్గాలు చర్చోపచర్చల్లో మునిగి తేలుతున్నారు. ఇంతకీ ఈ తరం పిల్లలకు ఏమైంది. కల్సి ఉండడానికి అంద చందాలు కలిగి కూచుని తిన్నా తరగని ఆస్తి పాస్తులు ఉంటేనే సరిపోతుందా? ఇవి మాత్రం ఉంటే సరిపోవు కదా! ఇప్పటి పిల్లలకు కావాల్సింది--తమకు కావాల్సిన జీవిత భాగస్వాములు పిక్చర్ పర్ఫెక్ట్ గా ఉండడం. జవాబుదారీ తనం లేని వ్యక్తి స్వేచ్ఛ కలిగి ఉండడం. నలుగురితో కాదు కదా చివరికి కట్టుకున్న వాళ్లతో కూడా కల్సి ఉండాల్సిన అవసరం లేదు. సంఘ జీవితం వీళ్లకు అసలు పడదు. ఇక పెద్దలకు కావాల్సింది ఆస్థి పాస్తులు, కట్న కానుకలు, కులం, గోత్రం, శాఖ, ఉప శాఖ, తాహతు, హోదా, అంతస్తు. వీటిలో దేనికీ తక్కువ ఉండకూడదు. జాతకాలు, గ్రహాలు, నక్షత్రాలు కలవాలి. కలిసి ఉండాల్సిన వాళ్ళ మనసుల తో పని లేదు. సమిష్టి కుటుంభ వ్యవస్థ నుంచీ దూరమయి న్యూక్లియస్ కుటుంబాలకు పరిమితం అయ్యాం. వన్ ఆర్ నన్ అనే జీవితాలకు పరిమితం అయ్యాం. ఎవరికి వారే యమునా తీరే. ఈ కాలం పిల్లలకు షేరింగ్ అంటే ఏమిటో తెలియదు. నలభై యాబయి ఏళ్లకు ముందు మా బాల్యం ఎలా ఉండేది? కోడి కూర లోనే షేరింగ్ మాధుర్యం రుచి చుసిన తరం మాది. ముక్కల మునగా తిన్నాం అని అంటున్నా కూడా వినకుండా అన్నం గిన్నె ముందు పిల్లలను కూచో పెట్టుకుని "ఇదా, ఈ మెత్తటి ముక్క తిను" అనే తాతల, నాయనమ్మల ప్రేమ ఎలా ఉంటుందో ఈ తరం పిల్లలకు తెలుసా?. ఇప్పుడు ఒక్కరి టవల్ ఇంకొకరు వాడకూడదు. ఒకరి సబ్బు ఇంకొకరు వాడకూడదు. ఎవరి మొబైల్ వాళ్లదే. అమ్మాయికి అబ్బాయి కావాలి కానీ, అబ్బాయికి వెనకా ముందూ ఎవరూ లేకపోతె బెస్ట్ అనే తంబు రూల్ శాసిస్తున్న కాలం లో ఇలా మిగిలి పోవాల్సి వచ్చింది. ఎవరి రాత వాళ్ళది అని సరిపెట్టుకునే అచేతనావస్థలోకి జారిపోయాం. ఇది వీళ్లకు జరగాల్సిందేలే అని సెలెబ్రిటీలను చూసి సంబరపడ్డాం మానేద్దాం. మనందరి ఇళ్ల ముంగిట్లో ఇలాంటి అరిష్టం తిష్ట వేసుకున్నది. అందుకే ఇది సామజిక సమస్య. తస్మాత్ జాగర్త!
Admin
Viswas Tv