విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / పశ్చిమగోదావరి జిల్లా : తణుకులో మందుల ఏజెన్సీలపై కేసులు.. రూ.8.10 లక్షల సరకు స్వాధీనం.... మెడికల్ ఏజెన్సీలో తనిఖీలు చేస్తున్న అధికారులు..... వైద్యలు సూచనల మేరకు మాత్రమే వినియోగించాల్సిన ఔషధాలను అనధికారికంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై ఔషధ నియంత్రణ అధికారులు కేసులు నమోదు చేసి, రూ.8.10 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు భీమవరం, తణుకు ఔషధ నియంత్రణ అధికారులు పి.మల్లికార్జునరావు, షేక్ అబిద్ అలీ, సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు పట్టణంలోని మెడికల్ ఏజెన్సీలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. స్థానిక వెంకటసాయి మెడికల్ ఏజెన్సీ యజమాని వరప్రసాద్ వయాగ్రా, నిద్ర మాత్రలు, అబార్షన్ కిట్లు అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడి నుంచి రూ.2 లక్షలు విలువ చేసే మందులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక మాత్రల అట్టలపై ఉన్న ధరలను చెరిపివేసి అధిక ధరలకు విక్రయించడంపైనా కేసు నమోదు చేశారు. దొడ్డిపట్లవారి వీధిలోని లక్ష్మీపవన్ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు ఉప్పల సోమనాగేశ్వర శ్రీనివాస్ ఓ కిరాణా దుకాణంలో మందులను నిల్వ ఉంచి ఆర్‌ఎంపీలకు అమ్ముతున్నట్లు గుర్తించి, రూ.60 వేలు విలువైన మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఇతడికి తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన కాపకాయల శ్రీనివాస్ సరఫరా చేస్తున్నట్లు తేలడంతో వెంకట్రాయపురం రైల్వే గేటు సమీపంలో ఉన్న గోదాములో తనిఖీలు నిర్వహించి సుమారు రూ.5.50 లక్షల విలువైన అబార్షన్ కిట్లు, మందులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా మత్తు మాత్రలు తీసుకొచ్చి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మెడికల్ ఏజెన్సీలు, రిటైల్ దుకాణాలు, ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు విక్రయిస్తున్నారని అధికారి అబిద్ అలీ తెలిపారు.
Admin
Viswas Tv